A Beautiful Mind !

ప్రకృతిని మించిన గురువుండదు. ప్రకృతికున్న విజ్ఞత, ఆలోచన ఏ గురువుకూ ఉండవు. ప్రకృతి ధర్మాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. గాలి లేనిదే దీపం వెలగదు. అదే గాలి... దీపాన్ని తుదముట్టిస్తుంది. నీరు లేనిదే పంట బతకదు. కానీ ఆ నీరే పంటను మింగేస్తుంది.

ఇలా పంచభూతాలలో ఏది లేకపోయినా జీవించలేం. అలాగే ఏది ఎక్కువైనా తక్కువైనా జీవించలేం. ప్రకృతి నిజంగా ఒక గొప్ప గురువు. ఒక అందమైన సూక్ష్మాన్ని మనకు నేర్పించే గురువు. బ్యాలెన్‌‌స. అంటే సమతూకం. మనిషి ప్రవర్తనలో ఏ వైపరీత్యాన్నయినా అది వెంటనే కరెక్టు చేస్తుంది.

కుటుంబం కూడా ప్రకృతి లాంటిదే. దీనికి కొన్ని రివాజులుంటాయి. కొన్ని ధర్మాలుంటాయి. కొన్ని నియమాలుంటాయి. వాటిలో వేటినైనా ఉల్లంఘిస్తే కరెక్షన్ వెంటనే జరిగిపోతుంది. జరగాలి. ఎప్పుడైతే కుటుంబం ఆ రూల్స్‌ను పాటించదో ముక్కలైపోతుంది. భర్త భార్యను కష్టపెడుతుంటే కుటుంబమంతా ఒక్కటై భర్తను కరెక్ట్ చేయాలి.

ఇంట్లో సంపాదించే మనిషి తానే కాబట్టి తాను ఏమి చేసినా చెల్లిపోతుంది అని ఆ భర్త అనుకోకూడదు. ఏది చేసినా ఫరవాలేదు అని ఆ కుటుంబమూ అనుకోకూడదు. ఇంటిపెద్దగా కుటుంబాన్ని సాకే ధర్మం ఆ భర్తది. తన ధర్మం తాను పాటించినందుకు అధర్మంగా ప్రవర్తించడం సరికాదు.

మట్టిని నీరు తాకితే ప్రాణం పుడుతుంది.
నీటిని మట్టి తాకితే కరిగిపోతుంది.
ఇది ప్రకృతి పాటించే నియమం.

ఈ మధ్యకాలంలో గృహిణులపై హింస విపరీతంగా పెరిగిపోతోంది. దురదృష్టం ఏమిటంటే హింసించేవారు తాము హింసిస్తున్నామని కూడా అనుకోవడం లేదు. ధరణిలా గృహిణికి ఎంతటి సహనం ఉన్నా ఏదో ఒకరోజు భూకంపం తప్పదు. ఇల్లంతా చిందరవందర కాకమానదు.

స్త్రీ కన్నీరు వరదగా మారితే మానవత్వం మట్టి గొట్టుకుపోతుంది. కరగాల్సింది హృదయాలు, మానవత్వం కాదు.పరిష్కారం చాలా సుళువు. కుటుంబానికున్న గొప్ప ధర్మం ప్రేమ. ఆ ధర్మాన్ని ప్రేమించండి.

ప్రేమతో...

Source: Sakshi

POSTED BY SATiSH
POSTED IN
DISCUSSION